
ఊరిని బాగుపరుస్తాననే నమ్మకముంది
మా సీనియర్ బిసాతి భరత్, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ ఆచార్య మురళీధర్‌రావు సార్, రమేష్ అన్న నన్నెంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా తెలుసుకున్నా. రాష్ట్రపతి అవార్డు నాపై మరింత బాధ్యత పెంచింది. ఈ స్ఫూర్తితో కనీసం బస్సు సౌకర్యం సరిగా లేని మా ఊరిని బాగుపరుస్తానన్న నమ్మకం నాకుంది.
– జయమారుతి,
జాతీయ అవార్డుగ్రహీత
అనంతపురం/కల్చరల్: ఉండేందుకు సక్రమమైన ఇల్లు కూడా లేదు.. వ్యవసాయ కూలి పనులు తప్ప మరో జీవనాధారమూ లేదు. అయినా వెనుకంజ వేయలేదు. చదువు ఒక్కటే తన పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మిన ఆ యువకుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగాడు. కష్టాలెన్ని ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నాడు. ఎన్నో స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలతో అందరినీమెప్పిస్తూ ఏకంగా రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యాడు. మొక్కవోని దీక్షతో శ్రమించి అనంత ఖ్యాతిని రెపరెపలాడిస్తూ జాతీయ సేవా పథకం (ఎస్‌ఎస్‌ఎస్)లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకున్న జయమారుతి విజయ ప్రస్థానమిది.
పేదరికాన్ని జయిస్తూ
బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కురుబ నీలకంఠప్ప, అనసూయమ్మ దంపతులు వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు జయమారుతి.. చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న ఆసక్తిని కనబరుస్తుండడంతో గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేయించారు. అనంతరం కళ్యాణదుర్గంలో ఇంటర్, అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, ఎస్కేయూలో పీజీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్నప్పుడే 2017 నుంచి 2022 వరకు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా వివిధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే పథకాలపై నిరుపేదలను చైతన్యపరిచారు. ఓటరు బాధ్యతలు, యోగా అవగాహన ర్యాలీలు చేపట్టి అందరినీ మెప్పించారు. ఫలితంగా 2019 –2020లో రాష్ట్రస్థాయి ఎన్‌ఎస్‌ఎస్ ఉత్తమ వలంటీర్‌గా నెహ్రూ యువకేంద్రం ద్వారా యంగ్ అచీవర్ అవార్డును కై వసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2021–2022 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 30 మంది వలంటీర్లను రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక చేయగా, వీరిలో మొదటి స్థానంలో జయమారుతి ఉండడం గమనార్హం. ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డునందుకోనున్నారు.
రాష్ట్రపతి అవార్డుకు ఎంపికై న జయమారుతి
