అనంతపురం అర్బన్: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వివిధ అంశాలపై సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే ఇంటింటి క్యాంపెయిన్ చేపట్టారన్నారు. ఇంటింటి క్యాంపెయిన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ తక్కువగా జరిగిందన్నారు. లోటుపాట్లు లేకుండా క్యాంపులు సక్రమంగా నిర్వహించేందుకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 27న వలంటీర్లు రెండో దఫా ఇంటింటి క్యాంపెయిన్ చేపట్టాలన్నారు.
నేడు పైలట్ ప్రాజెక్టు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం–1 విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద లాంఛనంగా ప్రారంభిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్టోబరు 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’లో భాగంగా పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. పట్టణాల్లో ప్రధాన ప్రాంతాల్లో చెత్తను తొలగించడం, గ్రామాల్లో వ్యర్థాలు వేసే ప్రాంతాల్లో శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. అక్టోబరు 1న ప్రజలతో ‘ఏక్ దిన్.. ఏక్ గంట’ కింద శ్రమదానం చేయించాలన్నారు.
ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలి
‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు డిసెంబరు 31 నాటికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి తీసుకురావాలన్నారు.