
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ సమస్యలు వింటున్న కలెక్టర్ గౌతమి
అనంతపురం అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘స్పందన’, ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాల్లో ప్రజల నుంచి అందే అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘స్పందన’లో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ గాయత్రీదేవి, ఆర్డీఓ మధుసూదన్, హౌసింగ్ పీడీ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు 417 అర్జీలు స్వీకరించారు. అనంతరం ‘స్పందన’, ‘జగనన్నకు చెబుదాం’ అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యను తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా పరిష్కరిస్తే అర్జీలు రీ–ఓపెన్ కావన్నారు. సమస్య పరిష్కరించిన తరువాత అదే విషయంపై అర్జీదారునికి తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు.
అర్జీల్లో కొన్ని...
● తన భూమిని వేరొకరి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారని పామిడి మండలం ఖాదర్‌పేటకు చెందిన సి.ఓబులేసు ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 162–2లో తనకు 4.68 ఎకరాలు భూమి (ఖాతా నంబరు 457) ఉందని చెప్పాడు. వర్షధారం కింద పంట సాగు చేసుకుంటున్నానని చెప్పాడు. అయితే ఈ భూమిని వేరొకరి పేరున ఆన్‌లైన్‌లో మార్పు చేశారని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు.
● తమ పొలాన్ని ఇద్దరు వ్యక్తులు వారి పేరున ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారని యాడికి మండలం నిట్టూరుకు చెందిన జింకల చిన్న నారాయణ ఫిర్యాదు చేశాడు. కమలపాడు గ్రామ పొలం సర్వే నంబరు 10–1లో తమకు 6.78 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని 1988లో కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయించుకున్నామని చెప్పాడు. అయితే 2.17 ఎకరాల చొప్పున ఇద్దరు వ్యక్తులు 4.34 ఎకరాలను వారి పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవడంతో పాటు పాసుపుస్తకాలు పొందారని చెప్పాడు. దీనిపై విచారణ చేయించి తనకు న్యాయం న్యాయం చేయాలని కోరాడు.