అనంతపురం కల్చరల్: మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దగల్గిన యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని షిరిడీనగర్‌లో గల వివేకానంద యోగా భవన్‌లో ఆదివారం వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన చిన్నారులకు యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన అనంతరం ముఖ్య అతిథి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు యోగా పట్ల ప్రత్యేక శ్రద్ధ కల్గించాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి యువజన సంక్షేమ శాఖ అధికారి కేశవనాయుడు మాట్లాడారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. సాయంత్రం ముగింపు వేడుకలకు డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, ఆర్డీటీ ఇంజినీర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యోగా గురువులు కృష్ణవేణి, దివాకర్, మారుతీప్రసాద్, పూజారి శ్రీనివాసులు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.