
సమీపంలోని ఇసుక దిబ్బల్లో కన్పిస్తున్న పచ్చని చెట్లు
కణేకల్లు: తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్యకర్త బరితెగించాడు. అటవీ శాఖ పరిధిలోని భూమిపై కన్నేశాడు. ఎడారి నివారణ కోసం కళేకుర్తి సమీపంలో పెంచిన చెట్లను నరికివేయించి, ఆనవాళ్లు లేకుండా చేశాడు. నాలుగెకరాలు చదును చేసుకుని ఆక్రమించాడు. వివరాల్లోకెళ్తే... కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో వేదవతి హగరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఇసుకమేటలు విస్తరించి ఎడారిని తలపిస్తున్నాయి. ఆషాఢంలో గాలులకు ఈ ఇసుక తెరలు తెరలుగా లేచి ఎగిసి మేటలుగా ఏర్పడుతుంటాయి. గత ప్రభుత్వాలు ఎడారి నివారణలో భాగంగా కళేకుర్తి, మాల్యం, తుంబిగనూరు, మీన్లహళ్లి, బిదరకుంతంతోపాటు వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాయి. ప్రస్తుతం ఈ మొక్కలు పెద్దవయ్యాయి. ఎటు చూసినా పచ్చగా కన్పిసి్తూ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మరో వైపు ఈ చెట్ల నడుమ ఇసుకదిబ్బలు ముందుకు కదలడం లేదు. వేదవతి హగరి ఒడ్డునున్న ఎడారి ప్రాంతమంతా అటవీ శాఖ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో పెంచుతున్న చెట్లను పరిరక్షించాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులదే.
సాగుకు అనుకూలమని కబ్జా..
కళేకుర్తి గ్రామ శివారులో హెచ్చెల్సీ అక్విడెక్ట్ కుడివైపున వేదవతి హగరి ఒడ్డున ఎడారి ప్రాంతంపై అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త కన్నుపడింది. ఈ భూమి పంటల సాగుకు చాలా అనువుగా ఉండటంతో ఎలాగైనా కబ్జా చేయాలనుకున్నాడు. అంతే నెల రోజుల క్రితం నాలుగు ఎకరాల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికించేశాడు. ఆ తర్వాత జేసీబీ సాయంతో చెట్ల ఆనవాళ్లు లేకుండా చేశాడు.
బీట్ ఆఫీసర్ మౌనం..
అటవీ భూముల్లో పచ్చని చెట్లను నరికివేస్తున్న విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముడుపులు తీసుకొని మౌనంగా ఉండిపోయారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రదేశానికి కొంత దూరంలో ఇసుక కూడా ఉంది. ఇసుక అక్రమ రవాణా కాకుండా బీట్ ఆఫీసర్ పహారా కాస్తుంటారు. చెట్ల నరికివేత విషయం తెలిసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
ఎకరా రూ.12 లక్షలు..
వేదవతి హగరి నది ఒడ్డున ఉన్న ఇసుక భూములు ప్రస్తుతం సారవంతంగా మారాయి. ఒకప్పుడు దేనికీ పనికిరాని ఈ భూముల్లో వేరుశనగ, వరి పంట చాలా బాగా పండుతోంది. దీంతో ఈ భూమికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎకరం రూ.12 లక్షల వరకు పలుకుతున్నట్లు సమాచారం. వేదవతి హగిరి ఒడ్డున ఉన్న ప్రభుత్వ భూములను అనేక మంది కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారు. అనధికారికంగా అగ్రిమెంట్లపై భూముల క్రయ విక్రయాలూ జరుగుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వ భూములు పూర్తిగా అన్యాక్రాంతమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఎడారి నివారణ కోసం పెంచిన చెట్లలో ఏ ఒక్కటి నరికినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇసుకదిబ్బలు విస్తరించకుండా కట్టడి చేసేందుకు ఎంతో కష్టపడి చెట్లను పెంచాం. అలా పెంచిన చెట్లను ఎవరు నరికారు? ఎంత విస్తీర్ణంలో నరికారు? అనే విషయాలను క్షేత్రస్థాయిలో వెళ్లి విచారణ చేస్తాం. అలాగే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీట్ ఆఫీసర్‌ను కూడా దీనిపై ఆరా తీస్తాం. చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం.
– బి.లక్ష్మప్ప డీఆర్‌ఓ, రాయదుర్గం
చెట్లు నరికివేయించిన టీడీపీ కార్యకర్త
4 ఎకరాలు చదును చేసి ఆక్రమణ
చోద్యం చూస్తున్న ఫారెస్టు అధికారులు

చెట్లు నరికేసి భూమి చదును చేసిన దృశ్యం