రాప్తాడు రూరల్: ‘నిపుణ్ భారత్’లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 22 వరకు ‘జన్ భాగిదారి’ కార్యక్రమం చేపట్టాలని డీఈఓ, సమగ్ర డీపీసీ ఎం.సాయిరామ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రీ ప్రైమరీ నుంచి 3వ తరగతి పిల్లలు పాఠశాల స్థాయిలో ఆరు రకాల కార్యక్రమాల (రంగోలి, పద్యపఠనం, క్విజ్, చిత్రలేఖనం, కథలు చెప్పడం, వక్తృత్వ పోటీలు)లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి నైపుణ్యాలు కనబరచిన పిల్లలను, వారి తల్లిదండ్రులను జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. మండల విద్యాశాఖ అధికారులు, సిబ్బంది వారి పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సూచించారు. బోధనాభ్యసన సామగ్రిని పాఠశాలల్లో ప్రదర్శించి.. అత్యుత్తమ ప్రదర్శనలను జిల్లాస్థాయి మేళాకు ఎంపిక చేయాలని ఎంఈఓలను ఆదేశించారు.