
అనుమానాస్పద మృతి
కుందుర్పి: మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన జోగప్పగారి హనుమంతు ఇంటి నిర్మాణ పనుల్లో కుమార్ పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన హనుమంతు, తదితరులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక కుమార్ మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమార్ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పోక్సో కేసులో
నిందితుడికి రిమాండ్
యాడికి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. యాడికిలోని అంకాలమ్మ వీధికి చెందిన వృద్ధుడు బోయ ఆదెప్ప మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదెప్పపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
6 పోస్టులు...172 దరఖాస్తులు!
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆరు సెక్టోరియల్ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 172 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుకు సోమవారంతో గడువు ముగిసింది. ఏఎంఓ, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ), అసిస్టెంట్ సీఎంఓ, ఏఎస్‌ఓ, అసిస్టెంట్ ఐఈడీ, అలెస్కో పోస్టుల భర్తీకి ఇటీవల నోటఫికేషన్ జారీ చేశారు. ఇందులో అత్యధికంగా అసిస్టెంట్ సీఎంఓ పోస్టుకు 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అలెస్కో పోస్టుకు 45 మంది, ఏఎంఓకు 37 మంది, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ)కు 14 మంది, అసిస్టెంట్ ఐఈడీకి 14 మంది, ఏఎస్‌ఓ పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేసి నిబంధనల మేరకు భర్తీ చేస్తామని ఏపీసీ టి.శైలజ స్పష్టం చేశారు.
పేకాట ఆడుతూ పట్టుబడిన జేసీ అనుచరులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: స్థానిక రూరల్ పరిధిలోని కడపరోడ్డు శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 13 మందిని స్పెషల్‌పార్టీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి.. రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డికి అప్పగించారు. వీరంతా మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు కావడం గమనార్హం. వీరి నుంచి రూ.1,23,700 నగదు, 13 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో తాడిపత్రిలోని గన్నెవారిపల్లెకాలనీకి చెందిన జేసీ ప్రధాన అనుచరుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. అందరూ అధికార పార్టీ వారు కావడం, అది కూడా జేసీ అనుచరులు కావడంతో పట్టుబడిన వారి పేర్లను తెలిపేందుకు సీఐ నిరాకరించారు. కాగా.. టీడీపీ నేత ఇంట్లోనే కొద్దికాలంగా పోలీసుల కనుసన్నలోనే పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. అనంతపురం స్పెషల్‌పార్టీ పోలీసులు పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకుని అప్పగించినా స్థానిక పోలీసులు మాత్రం కొద్దిపాటి మొత్తాన్నే చూపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.