డెంగీతో ఇద్దరు విద్యార్థుల మృతి

- - Sakshi

శింగనమల: జిల్లాలో ఇద్దరు విద్యార్థులు డెంగీ జ్వరంతో మృతి చెందారు. శింగనమల మండలంలోని లోలూరు గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతూ వడ్డే ప్రవీణ్‌కుమార్‌ (7) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికుల వివరాలమేరకు... లోలూరుకు చెందిన వడ్డే రాజు, మేఘన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ఐదురోజుల క్రితం జ్వరం బారిన పడటంతో చుట్టు పక్కల ఉన్న ఆస్పత్రుల్లో చూపించారు. కాగా శుక్రవారం ఉదయం బాలుడి పరిస్థితి విషమించడంతో అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ ప్రవీణ్‌కుమార్‌ మృతి చెందాడు.

వారం రోజులుగా జ్వరాలు

లోలూరు గ్రామంలో వారం రోజుల నుంచి చిన్నారులు, ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. శుక్రవారం మహమ్మద్‌ వయాజ్‌ అనే బాలుడికి అధిక జ్వరం రావడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. గ్రామంలో జ్వరాలు అధికంగా ఉన్నాయని, వైద్యులు వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

బొమ్మనహాళ్‌లో మరొకరు..

బొమ్మనహాళ్‌: మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో డెంగీ జ్వరంతో వన్నూరుస్వామి (13) అనే విద్యార్థి శుక్రవారం మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీధరఘట్టకు చెందిన ఈరమ్మ, ధనుంజయ దంపతుల కుమారుడు వన్నూరుస్వామి (13) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేవాడు. వేసవి సెలవులు కావడంతో కర్ణాటకలోని బళ్లారి జిల్లా కోళగల్లులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి గత నాలుగురోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ తరువాత తీవ్రమైన జ్వరం రావడంతో కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు డెంగీగా నిర్ధారించి రెండురోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో వన్నూరుస్వామి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మృతుడు ప్రవీణ్‌కుమార్‌, వన్నూరుస్వామి (ఫైల్‌)

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top