ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి

- - Sakshi

రాప్తాడురూరల్‌: పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అతి ముఖ్య ఘట్టమైన ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయింది. మూడు రోజుల పాటు కసరత్తు చేసిన విద్యాశాఖ ఎట్టకేలకు పూర్తిచేసింది. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరామ్‌ ఇన్విజిలేటర్ల జాబితాను పలుమార్లు పరిశీలించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌, సిబ్బందితో డీఈఓ సుదీర్ఘంగా చర్చించి జాబితాను ఫైనల్‌ చేశారు. ఎస్జీటీలకు సంబంధించిన జాబితాను మండల విద్యాశాఖ అధికారులకు పంపారు. స్కూల్‌ అసిస్టెంట్ల జాబితా పాఠశాల హెచ్‌ఎంలకు పంపారు. మరోవైపు ఇన్విజిలేటర్లగా నియమితులైన వారి మొబైల్‌ ఫోన్లకు విద్యాశాఖ నుంచి మెసేజ్‌లు పంపుతున్నారు. ఎస్జీటీలను ఎంఈఓలు, స్కూల్‌ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులు రిలీవ్‌ చేయనున్నారు.

1,978 మంది ఇన్విజిలేటర్లు

ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 139 మంది చీఫ్‌సూపరింటెండెంట్లు, 139 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించారు. మొత్తం 1978 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులను తనిఖీలు చేయడంలో భాగంగా బాలికలను తనిఖీలు చేసేందుకు వీలుగా ప్రతి కేంద్రంలోనూ కనీసం ఇద్దరికి తగ్గకుండా మహిళా ఇన్విజిలేటర్లను నియమించారు. మొత్తం 327 మంది మహిళా ఇన్విజిలేటర్లను నియమించారు. కాగా 300 మంది విద్యార్థుల సంఖ్య దాటిన పరీక్ష కేంద్రాలకు అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించనున్నారు. జిల్లాలో దాదాపు 20 కేంద్రాలకు పైగా అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమిస్తున్నారు.

ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ

ప్రతి కేంద్రంలో కనీసం ఇద్దరు తక్కువ కాకుండా మహిళా ఇన్విజిలేటర్లు

ఎవరికీ మినహాయింపు ఉండదు

పరీక్షల విధులకు నియమించిన వారిలో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదు. ఏదైనా బలమైన కారణాలు ఉంటే తప్ప మినహాయింపు ఇవ్వం. పదేళ్ల పాటు చదివిన విద్యార్థులు తొలిసారి పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నారు. గురువులు పరీక్షల నిర్వహణ బాధ్యతగా తీసుకోవాలి తప్ప సాకులు చెప్పి తప్పించుకోకూడదు. ప్రతి ఒక్కరూ సహకరించాలి.

– ఎం. సాయిరామ్‌ డీఈఓ

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top