
అనంతపురం: మహిళా సాధికారతతోనే దేశ పురోగతి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల్లో ఉన్న రుణాలను నాలుగు వాయిదాల్లో తాము నేరుగా చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద రెండు విడతలు నగదు జమను దిగ్విజయంగా పూర్తి చేశారు. శనివారం మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు బహిరంగ సభ నుంచి సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత కింద జిల్లాలో 31,229 స్వయం సహాయక సంఘాల్లోని 3,07,485 మంది అక్కచెల్లెమ్మలకు మంజూరైన రూ.233.66 కోట్లకు సంబంధించిన మెగా చెక్కును ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల ఆర్థిక పురోగతికి దోహదపడుతోందన్నారు. డ్వాక్రా రుణాల కంతులు కట్టొద్దని, తామే ఆ మొత్తం కడతామని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి.. ఎగ్గొట్టారన్నారు. దీంతో రుణ కంతులు చెల్లించక డీఫాల్టర్లుగా మారిన అక్కచెల్లెమ్మల ఇబ్బందులను పాదయాత్రలో వైఎస్ జగన్ గుర్తించారన్నారు. 2019 ఎన్నికల నాటికి బ్యాంకుల్లో అక్కచెల్లెమ్మల పేరిట ఉన్న రుణాలను తాము అధికారంలోకి వస్తే నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి.. నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. వారి సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా మూడో విడతలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 24,098 పొదుపు సంఘాలకు రూ.183.56 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 7,131 పొదుపు సంఘాలకు రూ.53.10 కోట్లు మంజూరైందన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, నాటక అకాడమీ చైర్‌పర్సన్ హరిత, పర్యాటక కార్పొరేషన్ డైరెక్టర్ భూమిరెడ్డి జాహ్నవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ఉమాదేవి, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
వరుసగా మూడో ఏడాదీ ‘వైఎస్సార్ ఆసరా’
అక్కచెల్లెమ్మలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రూ.233.66 కోట్ల మెగా చెక్కు పంపిణీ
