
వైఎస్సార్ ఆసరా వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురం సిటీ: డ్వాక్రా మహిళలనూ మోసగించిన నయవంచకుడు చంద్రబాబు అని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పి అప్పుల ఊబిలోకి నెట్టేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వరుసగా మూడో ఏడాది కూడా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలకు నగదు బదిలీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆ తరువాత వైఎస్ విగ్రహంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి, అందరికీ పంచిపెట్టారు. బీసీ సెల్ రీజనల్ కో–ఆర్డినేటర్ బీసీ రమేశ్ గౌడ్, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, సీనియర్ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బిందెల శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, సంయుక్త కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, పార్టీ, అనుబంధ విభాగాలకు చెందిన అన్ని క్యాడర్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలా నరసింహయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘డ్వాక్రా రుణాలు కట్టొద్దు. మేం అధికారంలోకి వస్తే మాఫీ చేస్తాం’ అన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు నమ్మి మహిళలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి మహిళలందరి జీవితాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా వెలుగులు నింపిన మహానుభావుడు సీఎం జగన్ అని కొనియాడారు. అక్కచెల్లెమ్మలకు సుస్థిర ఆదాయం రావాలని, వారు సృష్టించుకునే వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలన్నదే జగనన్న సంకల్పమని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు జగనే సీఎంగా ఉండాలని రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, నాయకులు బలపనూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పాడు
మహిళలను ఆదుకున్న మహానుభావుడు జగన్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయ్య