పది పరీక్షలకు సన్నద్ధం

డీఈఓ కార్యాలయం - Sakshi

రాప్తాడురూరల్‌: పదో తరగతి పరీక్షలు రాసే రెగ్యులర్‌ విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. జిల్లాలోని 31 మండలాల పరిధిలో గతంలో 25 వేలమంది ఉండేవారు. ఈసారి 30 వేలమంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీనికితోడు ఎప్పుడూ లేనివిధంగా ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. వన్‌ ఫెయిల్డ్‌ విద్యార్థులు దాదాపు ఐదు వేలమంది ఉన్నారు. మొత్తం మీద రెగ్యులర్‌, ప్రైవేట్‌ (ఫెయిల్‌) విద్యార్థులు కలిపి 35,305 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 139 సెంటర్లు ఏర్పాటు చేశారు. అనంతపురం నగరంలో ఏటా 25 సెంటర్లు ఉండేవి. ఈసారి ఆ సంఖ్య 32కు పెరిగింది. ఏప్రిల్‌ మూడో తేదీ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారుల నియామకం పూర్తయింది. వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ జరుగుతోంది. విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా పాఠశాలల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. హెచ్‌ఎంలు డౌన్‌లోడ్‌ చేసుకుని సంతకం చేసి విద్యార్థులకు అందజేస్తున్నారు.

సబ్జెక్టు టీచర్లను నియమించరాదు..

ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలలు, మునిసిపల్‌, యూపీ, ఎయిడెడ్‌ యూపీ పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు, లాంగ్వేజ్‌ పండిట్ల సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. సబ్జెక్టుల పరీక్షలు జరిగే రోజుల్లో ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ విధులు కేటాయించవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. ఇన్విజిలేషన్‌ విధులకు పీఈటీలు, క్రాఫ్ట్‌ టీచర్లు, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ టీచర్ల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. వీరందరి నియామకాలు పూర్తయిన తర్వాత కూడా ఇన్విజిలేటర్ల కొరత ఉంటే సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ప్రాధాన్యత క్రమంలో నియమిస్తారు. ఒకే పాఠశాలలో ఆరుగురు ఎస్జీటీలు పని చేస్తుంటే వారిలో నలుగురిని ఇన్విజిలేషన్‌ విధులకు నియమించుకోనున్నారు. ఇద్దరు ఉంటే ఒకరిని నియమిస్తారు. సింగిల్‌ టీచర్‌ ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి ఇన్విజిలేషన్‌ విధులకు నియమించరు.

‘నో ఫోన్‌’ జోన్లుగా కేంద్రాలు..

పరీక్షల విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, నాన్‌ టీచింగ్‌, ఇతర శాఖల సిబ్బంది (ఏఎన్‌ఎంలు, చీఫ్‌ సూపరింటెండెంట్లు సహా పోలీసు సిబ్బంది) పరీక్ష కేంద్రాలకు మొబైల్‌ ఫోన్లు తీసుకురాకూడదు. స్మార్ట్‌ వాచ్‌లు, డిజిటల్‌ వాచ్‌లు, కెమెరాలు, బ్లూటూత్‌ పరికరాలు, ఇయర్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించకూడదు. సిబ్బంది, విద్యార్థుల వద్ద పరీక్ష కేంద్ర ప్రాంగణంలో మొబైల్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరం గుర్తిస్తే వెంటనే జప్తు చేయాలి.

జిల్లాలో మండలాలు 31

పదో తరగతి పరీక్ష కేంద్రాలు 139

హాజరుకానున్న విద్యార్థులు 35,305

ఏర్పాట్లు షురూ..

అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాల కల్పన

ఈసారి పెరిగిన విద్యార్థుల సంఖ్య

ఇన్విజిలేటర్ల నియామకాలు జరుగుతున్నాయి

పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్ల నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే డీఓ, సీఎస్‌ల నియామకం పూర్తయింది. వారికి శిక్షణ కూడా ఇచ్చాం. ఇబ్బందులు తలెత్తకుండా అన్ని కేంద్రాల్లోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.

– గోవిందునాయక్‌, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌

ఇబ్బందులు లేకుండా చర్యలు

ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచరు, వెలుతురు ఉండేలా చూస్తున్నాం. అందరూ సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బందీ తలెత్తకుండా పరీక్షకేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.సాయిరాం డీఈఓ

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top