చోడవరం: వైఎస్సార్సీపీ హయాంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచాయతీ సర్పంచ్ల పదవీ ముగిసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని 91 మంది సర్పంచ్లను శనివారం ఘనంగా సత్కరించారు. చోడవరంలో జరిగిన సన్మాన సభలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు సర్పంచ్ల పర్యవేక్షణలో పనిచేసే మహోన్నత విధానాన్ని తెచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థలో వలంటీర్లను తెచ్చి సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించేలా చేశారని కొనియాడారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రతీ పని వలంటీర్ల ద్వారా సచివాలయంలోనే జరిగేలా ఒక కొత్త వ్యవస్థను తెచ్చి దేశ చరిత్రలో రికార్డు సృష్టించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అన్నారు. ప్రతీ పంచాయతీలో రూ. 2.5 కోట్లతో పంచాయతీ భవనాలు, సచివాలయం, కమ్యూనిటీ ఆస్పత్రి, రైతు భరోసా కేంద్రం కట్టించి, ఆయా కార్యాయాల్లోనే పూర్తి స్థాయిలో ప్రజలు సేవలు అందించారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్లపాటు గ్రామ స్థాయిలో ప్రజలకు ఎంతో సేవలు అందించిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబు, జెడ్పీటీసీ పోతల శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, ఎంపీపీలు గాడి కాసు, పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, దొండా నారాయణమూర్తి, శరగడం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


