ఒకరు మృతి,ఐదుగురికి గాయాలు
వెదుళ్లపాలెం వద్ద ఘటన
క్షతగాత్రులు విజయనగరం జిల్లా వాసులు
ప్రమాదవివరాలు తెలుసుకుంటున్న ఎస్ఐ సన్నిబాబు,
(ఇన్సెట్) రామ్మూర్తి మృతదేహం
నక్కపల్లి: జాతీయరహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన సుమారు 10 మంది వ్యాన్‌లో ఒంగోలు వెళ్లారు.అక్కడ ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ నక్కపల్లి సమీపంలో వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపక్కన పార్క్చేసిన ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది. ఈఘటనలో వ్యాన్‌లో డ్రైవర్ పక్కన కూర్చొన్న రాజాన రామ్మూర్తి(60) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.వ్యాన్‌లో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోవిజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాంకు చెందిన దండుపాటి శాంతి, ఇదే మండలం చామలపల్లిగ్రామానికి చెందిన జుత్తాడ దేవి,కొత్తవలస మండలం ముమ్మలోడుపాలెంకు చెందిన మంతిన దుర్గమ్మ, చామలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రామలక్ష్మి,గింజేరి గ్రామానికి చెందిన నానిపల్లి లక్ష్మి ఉన్నారు. వీరికి నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.


