సాక్షి, అనకాపల్లి: పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన రానుంది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 2వ తేదీ గురువారంతో ముగుస్తుంది. ఈ మేరకు ఎన్నికలు జరిగే వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారులను పాలనలోకి వెళతాయి. ఈ మేరకు ఆయా అధికారులతో జాబితాను తయారీ చేసింది. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ఎడ్యుకేషన్, మండల అగ్రికల్చర్ అధికారులు, సీడీపీఓ అధికారులు ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఒక్కో అధికారికి రెండు నుంచి మూడు, నాలుగు వరకూ పంచాయతీల బాధ్యతలు అప్పగించారు.
దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. గజిటెడ్ హోదా కలిగిన అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారులు మండలాల్లో పనిచేస్తున్న గజిటెడ్ హోదా కలిగిన, మండల అధికారులతో జిల్లాలో 216 మంది అధికారులతో జాబితాలను తయారు చేశారు. ఈ మేరకు వివరాలను సిద్ధం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్ ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేసి, ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపించారు. ఈ జాబితా ఆమోదం పొందినట్లు సమాచారం. అధికారికంగా ఈ నెల 3వ తేదీన విడుదల చేయనున్నారు. పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగే వరకు, లేదా ఆరు నెలలపాటు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది.
646 పంచాయతీలకు ప్రత్యేకాధికారులు
జిల్లాలో 24 మండలాల పరిధిలో మొత్తం 646 గ్రామ పంచాయతీలున్నాయి. 2021 ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో (అప్పట్లో ఉమ్మడి జిల్లా) నాలుగు దశల్లో పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఏప్రిల్ రెండో తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల రెండో తేదీతో ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా కుటుంబ సర్వే, బీసీ జనాభాగణన, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణను కొద్ది నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 646 పంచాయతీలకు గానూ 216 మంది అధికారులను నియమిస్తూ జాబితా సిద్ధం చేశారు.
సర్పంచ్‌లపై కూటమి కక్ష సాధింపు
ఇప్పటివరకు గ్రామ అవసరాల కోసం సర్పంచులు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉండేది. అయితే నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ఈ అధికారాలను పరిమితం చేసింది. ఇకపై సర్పంచులు జారీ చేసే ప్రతి చెక్కును డీఎల్‌డీఓ ఆమోదించడం తప్పనిసరి. పంచాయతీ కార్యదర్శులు నేరుగా చెక్కులను ప్రాసెస్ చేయకుండా డీఎల్‌డీవోల అనుమతి పొందిన తర్వాతే నిధులు విడుదయ్యేలా నిబంధనలు మార్చారు. జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సర్పంచ్‌లు ఉండడంతో వారిని ఇబ్బంది పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నేటితో ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం
ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు పూర్తి
మండల స్థాయి అధికారులకూ బాధ్యతలు
ఎన్నికలు జరిగే వరకూ అధికారుల పాలనే
జిల్లాలో మొత్తం 646 పంచాయతీల్లో 216 అధికారులు
ఇప్పటికే మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన
ఎన్నికలకు వెళ్లే యోచనలో లేని ప్రభుత్వం
స్పెషల్ ఆఫీసర్ల జాబితా సిద్ధం
పంచాయతీ సర్పంచ్‌ల గడువు ఈ నెల 2తో ముగియనుంది. మూడో తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన ఉంటుంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల జాబితా ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించాం. శుక్రవారం ఉదయం జాబితా ప్రకటిస్తాం. 24 మండలాల్లో ఉన్న ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్‌లు, మండల ఎడ్యుకేషన్, మండల అగ్రికల్చర్ అధికారులు, సీడీపీఓ అధికారులను నియమించడం జరిగింది.
– సందీప్, జిల్లా పంచాయతీ అధికారి,
అనకాపల్లి జిల్లా


