డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి నమోదయ్యాయి. నగరంలో 6 లక్షలకు పైగా ఆస్తి/ఖాళీ జాగా అసెస్‌మెంట్లు ఉండగా, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి రూ.620.08 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ కారణంగా ప్రజలు, సంస్థలు భారీగా పన్నులు చెల్లించడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.510.15 కోట్లు వసూలవగా, ఈసారి రూ.109.93 కోట్లు అధికంగా వచ్చింది. అదనపు కమిషనర్ (రెవెన్యూ), డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని కమిషనర్ తెలిపారు. రాత్రి 12 గంటల వరకు అన్ని సౌకర్య కేంద్రాలు పనిచేస్తుండటంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడిన ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కృతజ్ఞతలు తెలిపారు.


