అధికార పార్టీ అండతోనే కబ్జా? భూమి చదునుకు జీవీఎంసీ వాహనం వినియోగం అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్యనేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రూ.3 కోట్లు విలువ చేసే భూమి
విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్‌కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం
ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్‌ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది.
అసలు సూత్రధారులు ఎవరు?
అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


