అనకాపల్లి : ఆంగ్లభాష ప్రాముఖ్యత నేటి ఆధనిక ప్రపంచంలో ప్రచండ వేగంతో దూసుకుపోతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో ఏపీ ఎంఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడు విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ట్రాన్స్‌మ్యుటేషన్ ఆఫ్ హిస్టరీ లిటరేచర్’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక సాహిత్యం ద్వారా ఆంగ్ల భాషాభివృద్ధి చేసుకోవాలనుకునే వారికీ, ఆంగ్లభాష వ్యక్తీకరణని అభివృద్ధి చేసుకోదలచుకునే వ్యక్తులకు క్లుప్తంగా ఆంగ్లభాషపై మంచి పట్టు సంపాదించుకుని తనదైన శైలిలో ఆంగ్లంలో భావప్రకటన చేయదలచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక రచయిత డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర విషయాలను, వివిధ రకాల రచయితల రచనా పటిమను పరిగణనలోనికి తీసుకుంటూ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అప్పారావు, కిషోర్, సాయిరామ్. పలాసరావు(పోస్టల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్), కాళిదాస్, టి.లక్ష్మీనాయుడు పాల్గొన్నారు.


