విద్యా సంవత్సరం ముగియకముందే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి.
కిండర్‌గార్డెన్ స్కూళ్లు.. వేల కొద్దీ ఫీజులు
ఫిర్యాదులొస్తే చర్యలు
జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎల్‌కేజీ, యూకేజీ వంటి తరగతులు నిర్వహిస్తున్నట్టు గానీ, కిండర్ గార్డెన్ స్కూళ్ల నిర్వహణపై గానీ ఫిర్యాదులొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా నిర్వహించేందుకు తరచూ తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు.
–గిడ్డి అప్పారావు నాయుడు, డీఈవో
జిల్లాలో 122 మంది ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిలో సుమారుగా 58 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో చాలా పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలో 150కి పైగా కిండర్ గార్డెన్ స్కూళ్లు ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ఈ స్కూళ్లు విధిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఈ పాఠశాలల్లో వేలకొద్దీ ఫీజులు గుంజుతున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ‘ఫిర్యాదు వస్తేనే స్పందిస్తాం...’ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాల ప్రలోభాలకు తలొగ్గుతున్న అధికారులు వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. అర్హత లేని టీచర్లతో తక్కువ వేతనాలకు బోధన చేయిస్తూ ఏటా రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. మునగపాకలో ఇటీవల ఓ ప్రైవేటు విద్యాసంస్థ అనుమతుల్లేకుండా ముందస్తు ప్రవేశాలు చేపడుతుండడంపై ఏఐఎస్‌ఎఫ్ నేతలు ఆందోళన నిర్వహించారు. చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు.


