యలమంచిలి రూరల్ :
జిల్లా కేంద్రం అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అచ్యుతాపురం, అడ్డురోడ్డు సహా జిల్లాలో దాదాపుగా అన్ని మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల్లో ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ల దందా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల స్థాయిలోనే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ల పేరుతో విద్యార్థులపై మితిమీరిన ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులపై అదనపు ఫీజుల భారం మోపుతున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ సామాన్య తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి యాజమాన్యాలు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమ కళ్ల ముందే నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేట్‌కు సలామ్
కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. జిల్లాలో కార్పొరేట్, కొన్ని బడా ప్రైవేటు యాజమాన్యాలు అనుమతుల్లేకపోయినా ధనదాహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తయినా చూడడానికి సాహసించడం లేదు. నిబంధనల ప్రకారం ఎల్‌కేజీ, కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వరు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఈ తరగతుల నిర్వహణ నిరాటంకంగా కొనసాగిపోతోంది. విద్యాశాఖ అధికారుల తీరుతో యాజమాన్యాలు ఆడిందే ఆట..పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది.
సమాచారం నిల్
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కిండర్ గార్డెన్ స్కూళ్ల వివరాలు నమోదైన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తమకు తగిన సమాచారం లేదంటున్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా నేటికీ ఒక్క స్కూల్‌పై కూడా చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు లేకుండానే ప్రైమరీ, ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్ల దోపిడీ
అనుమతుల్లేకుండా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ
పుట్టగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు
విద్యాసంవత్సరం ముగియకుండానే అడ్మిషన్లు ప్రారంభం
తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు
తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు


