ఆర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 64 ఆర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ తుహిన్ సిన్హాకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చి అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–31, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–5, ఇతర విభాగాలకు చెందినవి–26 వచ్చినట్టు తెలిపారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్వామా పీడీ పూర్ణిమాదేవి బదిలీ
తుమ్మపాల : జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిగా ఆమెకు బదిలీ అయ్యింది.
ఎండీఎంను ప్రైవేటుపరం చేయొద్దని ధర్నా
రోలుగుంట: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు కె.ప్రసన్న మాట్లాడుతూ స్మార్ట్ కిచిన్ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తోందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూ నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి, ఎండీఎం మండల నాయకులు అమ్మాజి, రమ, వరహాలమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


