ఆనందపురం: గంభీరం రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటున్న నితిన్.. మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో నితిన్‌ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్‌ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు, ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్‌ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


