చెరువు గర్భంలో మరలా పనులు చేస్తున్న దృశ్యం
గొలుగొండ: మండలంలోని సీహెచ్ నాగాపురం చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేయకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరించారు. మళ్లీ పనులు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. ఆ స్థలాన్ని వదిలేసి కూటమి నేతలు రైతులకు ఉపయోగపడే చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు గర్భంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక పాఠశాలకు ఆనుకుని ఉండటం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతారని ప్రజలు ఆర్నెల్ల క్రితం వ్యతిరేకించారు. దీంతోపాటు రైతులు ఇబ్బందులు పడే అవకాశముందని గ్రామస్తులు, పంచాయతీ పాలకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో చెరువు గర్భంలో పనులు నిలుపుదల చేయాలని నాలుగు నెలలు క్రితం కోర్టు ఎంపీడీవో, పీఆర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పనులు నిలుపుదల చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పనులు చేస్తున్న అధికారులుపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


