గొలుగొండ: అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కోరారు. చేతిలో అధికారం ఉందని వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని కూటమి నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. మండలంలోని పప్పుశెట్టిపాలెం పంచాయతీ శివారు జమ్మేదేవిపేట గ్రామంలోని కమ్యూనిటీ భవనం నిర్మాణంలో అవకతవకలపై ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణ సాగుతోంది. దీనిపై సమగ్ర వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశాల మేరకు గొలుగొండ ఎస్‌ఐ రామారావు గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి విజయలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణనాయుడులకు 41 నోటీసులు ఇచ్చారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారిని విచారించారు. దీనిపై వచ్చిన అనుమానాలతో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో గొలుగొండ మండల నేతలంతా ఎస్‌ఐను కలిశారు. హైకోర్టు ఆదేశాలు మేరకు ఎస్‌ఐ పనిచేయాలని కోరారు. సమగ్ర వివరాలు కోర్టుకు నివేదిస్తామని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం విలేకరులతో మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కమ్యూనిటీ భవనం పనుల్లో అవినీతిపై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, కాంట్రాక్టర్‌పై ఎస్పీకి గ్రామస్తులు ఫిర్యాదులు చేశారన్నారు. అయితే పంచాయతీ కార్యదర్శితోపాటు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన సర్పంచ్, కాంట్రాక్టర్‌పై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే సదరు కాంట్రాక్టర్ హైకోర్టులో రూ.1.50 లక్షలు జమ చేశారన్నారు. కాంట్రాక్టర్, సర్పంచ్‌లపై మూడు నెలల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించిందన్నారు. ఈ పనులకు సర్పంచ్ విజయలక్ష్మికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గంలో కొంతమంది అధికారులు వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి వేధింపులు చేస్తున్నారని, త్వరలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని కోర్టు ముందు నిలబెడతామన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సలర్, న్యాయవాది బుల్లిదొర, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, వైస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, సర్పంచ్‌లు, ఎంపీటీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


