కూటమి వైఫల్యాలపై
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ నగరాన్ని వేదికగా చేసుకుని కూటమి నేతలు సాగిస్తున్న భూఆక్రమణలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల ఆత్మీయ సత్కారం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జగనన్న మాట.. మీకే మా భరోసా!
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ వెంటే ఉన్న కార్పొరేటర్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటగా హామీ ఇచ్చారు. ‘మీరు ఎక్స్ కార్పొరేటర్లు కాదు.. నెక్ట్స్ కార్పొరేటర్లు‘ అని ఉత్సాహపరిచారు. విలువలు, విశ్వసనీయతతో పనిచేసేవారే మన నాయకుడికి ఇష్టమని, ఆ బాటలోనే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
విశాఖలో భూదోపిడీపై ఉద్యమించాలి: కేకే రాజు
వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూదోపిడీని ప్రజలకు వివరించాలని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తేవాలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్‌సీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అభివృద్ధి శూన్యం: వరుదు కల్యాణి
ఏడాదిగా కూటమి నేతలు కుట్రలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారే తప్ప, నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. కేవలం దోచుకోవడానికే అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరి గిన అభివృద్ధిని చూసి ప్రజలు నేటికీ హర్షిస్తున్నారని గుర్తుచేశారు.
కార్పొరేటర్లకు ఘన సత్కారం
కార్యక్రమంలో భాగంగా మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తాజా మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు సహా పలువురు కార్పొరేటర్లను, కో–ఆప్షన్ సభ్యులను కేకే రాజు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు. సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, సీఈసీ సభ్యులు, భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
విశాఖలో భూదోపిడీని ఎండగట్టాలి
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
పార్టీ వెంటే ఉన్న కార్పొరేటర్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాటగా చెబుతున్నా..
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ఘనంగా ‘ఆత్మీయ సత్కారం’


