విలవిల!
వంచెన వలలో
● హోం మంత్రి హామీ నమ్మి దీక్ష విరమించిన మత్స్యకారులు
● మళ్లీ ఉద్యమానికిసై అంటున్న గంగపుత్రులు
వంచన వలలో
చర్చల పేరుతో ఉద్యమానికి కళ్లెం
నెలారోజులైనా దొరకని సీఎం అపాయింట్‌మెంట్
నక్కపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్‌డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం చర్చలపేరుతో నీళ్లు జల్లింది. సీఎం వద్దకు తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామంటూ హోం మంత్రి హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, చందనాడ, బుచ్చిరాజుపేట తదితర గ్రామాల పరిధిలో 1800 ఎకరాల్లో ప్రభుత్వం బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఏర్పాటైన రసాయన పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యంతో సుమారు 30 మంది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేస్తే వందల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఈప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారి , తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజయ్యపేట మత్స్యకారులు నిరాహారదీక్ష చేపట్టారు.
పోలీసులు ఆటంకాలు సృష్టించినా..
శాంతియుతంగా గ్రామంలో నిరాహారదీక్ష చేస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది. టెంట్లు, మైక్‌సెట్లు ఏర్పాటు చేయకుండా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ మత్స్యకారులు మండుటెండలో ఇసుక తిన్నెలపై నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు యథావిధిగా చేపట్టడంతో ఆగ్రహించిన గంగపుత్రులు...పార్క్ పనులు అడ్డుకుని రోడ్డుపై రాకపోకలు నిలిపి వేశారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో మంత్రి గ్రామంలోకి వచ్చి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గ్రామస్తులంతా మంత్రి కాన్వాయ్‌ను అడ్డగించి ఘోరావ్ చేశారు. తదుపరి నిరాహారదీక్షను నూకతాత ఆలయం వద్దకు మార్చి కొనసాగించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు. వందలాది మంది పోలీసులు గ్రామంలో మోహరించి, రాజయ్యపేట వెళ్లే దారులన్నింటి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారిని గృహనిర్బంధం చేయడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించి గంగపుత్రులు జాతీ యరహదారిని ముట్టడించి ఐదు గంటల పాటు రాకపోకలు స్తంభింపజేశారు. ప్రభుత్వం దిగివచ్చి కలెక్టర్‌ను చర్చలకు పంపిస్తామని హామీ ఇచ్చి జాతీయరహదారి ముట్టడి కార్యక్రమం నుంచి ఆందోళన కారులను పంపించి వేసింది. తర్వాత 10 రోజులకు కలెక్టర్ విజయ్‌కృష్ణన్ గ్రామంలోకి వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. మత్స్యకారులంతా ముక్తకంఠంతో బల్క్‌డ్రగ్‌పార్క్‌ను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈవ్యవహారం తన పరిధిలో లేదని మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చేతులేత్తేశారు. మత్స్యకారులు యథావిధిగా ఆందోళన కొనసాగించారు.
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిని మత్స్యకారులంతా కలసి బల్క్‌డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరుకు శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సుమారు 50 మంది సీనియర్ నేతలు మత్స్యకారులకు మద్దతుగా రాజయ్యపేట వచ్చి సంఘీభావం ప్రకటించారు.
చర్చలపై ప్రకటన చేయాలి
61 మందితో కమిటీ
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడం, జాతీయ రహదారిని ముట్టడించడం వంటి ఆందోళనలకు సంబంధించి పోలీసులు మత్స్యకారులపై పలుసెక్షన్‌లతో కూడిన కేసులు నమోదు చేశా రు. గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. మత్స్యకారులు వెనుకడుగు వేయలేదు. ఈలోగా కొంత మంది మత్స్యకారులు ప్రజాదర్బార్‌లో హోంమంత్రిని కలిసి రాజయ్యపేట బల్క్‌డ్రగ్ సమస్యపరిష్కరించాలని కోరారు. కమిటీగా ఏర్పడి వస్తే తాను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తానని, మీకు న్యాయం జరగకపోతే మీ ఆందోళన మీరు కొనసాగించుకోవచ్చని ఆమె ప్రకటించారు.ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వైఎస్సార్‌సీసీ నేతలు వీసం రామకృష్ణ తదితరులు సహితం సీఎంతో చర్చలు జరపడం మంచిదే, నాయ్యం జరగకపోతే ఆందోళన కొనసాగిద్దాం అని సూచించడంతో అప్పటికే రెండునెలలుగా వేటమానుకుని ఉపాధి లేకుండా పస్తులతో నిరాహార దీక్ష చేస్తున్న మత్స్యకారులంతా మంత్రి ప్రకటనపై గౌరవంతో 61 మందితో కమిటీగా ఏర్పాటై ఈ జాబితాను ఆర్‌డీవో ద్వారా హోంమంత్రికి, కలెక్ట్‌కు అందజేశారు.
చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్తామంటేనే దీక్షను తాత్కాలికంగా విరమించాం. కమిటీ వేసి నెలరోజులు అవుతోంది. ఎవరూ ఏం మాట్లాడటంలేదు. గ్రామంలో మత్స్యకారులు ఒప్పు కోవడం లేదు. మళ్లీ ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేవిషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. విశాఖలో చంద్రబాబునాయుడిని కలిసే ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తాం. అధికారులు కూడా ఎటువంటి ప్రకటన చేయకపోవడం తగదు. ప్రభుత్వంతో చర్చల విషయంపై ఏదో ఒక ప్రకటన చేయాలి.
–గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు,మత్య్సకార నాయకురాలు, రాజయ్యపేట
విలవిల!
విలవిల!
విలవిల!


