అప్పన్న భూముల పందేరం
వివాదాల సుడిగుండంలో సింహాచలం భూములు
పంచగ్రామాల పీటముడి వీడేదెన్నడు?
దేవాలయ భూములు పంచడాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ ధార్మిక సంస్థలు
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. ఆ స్వామి పేరిట ఉన్న వేల ఎకరాల భూములు దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో ఉన్నాయి. పేదవాడి సొంతింటి కలకు, ఆలయ ఆస్తుల రక్షణకు మధ్య పోరాటం సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు విలువైన స్వామి భూములను కార్పొరేట్ సంస్థలకు, ఇతర అవసరాలకు ‘పందేరం’ చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముడసర్లోవ పార్కుకు సమీపంలో.. సెంట్రల్ జైలు పక్కన సర్వే నంబర్ 275లో ఉన్న సుమారు 150 ఎకరాల దేవస్థానం భూమిలను గూగుల్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గజం దేవస్థానం భూమి కూడా పరాయిపాలు చేయకూడదన్న నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘రాష్ట్ర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ దేవుడి భూములను ధారాదత్తం చేయడం చట్టవిరుద్ధం’ అని వీహెచ్‌పీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
పంచగ్రామాల కథ.. అంతులేని వ్యధ
భీమిలి నియోజకవర్గం పరిధిలోని అడవివరం, పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామాలను కలిపి పంచగ్రామాలుగా పిలుస్తారు. దశాబ్దాలుగా ఈ గ్రామాల్లో భూ సమస్య కొనసాగుతోంది. 1901 నాటి గిల్‌మెన్ రికార్డుల ప్రకారం సింహాచలం దేవస్థానానికి పై గ్రామాల్లో మొత్తం 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో అడవివరం పరిధిలోనే అత్యధిక భూములు ఉన్నాయి(గతంలో హైకోర్టు 275 సర్వే నంబర్‌లోని గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించిన 5 వేల ఎకరాలతో కలిపి). మిగిలిన సుమారు 1,800 ఎకరాల జిరాయితీ భూములే వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. 1996 వరకు ఈ భూములపై ఎటువంటి వివాదం లేదు. తర్వాత ఈ భూములపై రెవెన్యూ విభాగానికి, సింహాచలం దేవస్థానానికి మధ్య యాజమాన్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. పెందుర్తి, చినగదిలి ఎంఆర్వోలు ఈ భూములపై సర్వహక్కులను సింహాచలం దేవస్థానానికి అప్పగిస్తూ రైత్వారీ పట్టాలు జారీ చేశారు. అప్పటివరకు ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఆ భూములను తమ సొంత ఆస్తిగానే భావించారు. అయితే, దేవస్థానం పేరుతో పట్టా రావడంతో, అక్కడి నివాసితులను దేవస్థానం యంత్రాంగం ఆక్రమణదారులుగా పేర్కొనడం ప్రారంభించింది. దీంతో సమస్య జటిలమైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 12 వేల మందికి పైగా ఈ భూముల్లో నివసిస్తున్నారు. మొత్తం 419 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం ఈ వివాదంపై జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి.
జీవోను తక్షణం రద్దు చేయాలి
మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఆలయ భూములను పందేరం చేయడం సరికాదు. గూగుల్ సంస్థకు కేటాయించిన జీవోను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో హైందవ సమాజం తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– ఆచార్య కందర్ప విశ్వనాథ్,
అధ్యక్షుడు, వీహెచ్‌పీ విశాఖ మహానగ
ఇచ్చిన భూమి వెనక్కి.?
దాదాపు 30 ఏళ్ల కిందట సెంట్రల్ జైలు నిర్మాణం కోసం అడవివరంలో 106 ఎకరాల దేవస్థానం భూమిని ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా మధురవాడ పరిధిలోని సర్వే నంబర్ 420, 424లో అంతే స్థలాన్ని దేవస్థానానికి కేటాయించింది. అయితే, తాజాగా ఆ ప్రత్యామ్నాయ భూమిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేవాలయ ఆస్తులను కాపాడండి
హిందూ దేవదాయ ధర్మదాయ చట్టం ప్రకారం దేవాలయ భూములను ఇతర అవసరాలకు వాడటం నిషిద్ధం. ఆలయ ఆస్తులు కేవలం ఆలయ అభివృద్ధికే వాడాలని వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరిస్తే, దానికి సమానమైన విలువ గల భూమిని ఇస్తామని, దేవాలయ ఆస్తులకు నష్టం కలగకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టులకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ తీర్పులను ప్రభుత్వం తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా అప్పన్న భూములను కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ భూములను/ఆస్తులను ప్రభుత్వంతో సహా ఇతరులెవ్వరూ, అన్యాక్రాతం చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావంలో కూడా తీర్మానం చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న పంచగ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. స్వామి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


