పనిచేయని నాయకులకు అభివృద్ధి నిధులివ్వం
స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు
నాతవరం: గ్రామాల్లో పని చేయని నాయకులకు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయనని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ సెల్‌ఫోన్లు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు, నాతవరం నుంచి తాండవ రిజర్వాయరుకు వెళ్లే రోడ్డుకు రూ.3.50 కోట్లు మంజూరు చేశానన్నారు. ఈ నిధులతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో లింకు రోడ్ల అభివృద్ధికి రూ.24 కోట్లు మంజూరు చేసానన్నారు. మండలంలో పలు గ్రామాల్లో వీధుల్లో సిమెంట్ రోడ్లకు రూ.5.50 కోట్లు మంజూరు చేశానన్నారు. గత ఏడాది మండలంలో అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తే వాటిలో 14 గ్రామాల్లో మా నాయకులు రూ.కోటి 60 లక్షలకు పైగా నిధులతో ఇంత వరకు పనులు చేయలేదన్నారు. ఆయా గ్రామాల్లో నాయకులకు అభివృద్ధి పనులకు ఈఏడాది నిధులు ఇచ్చేదిలేదన్నారు.


