హమ్మయ్యా.. సక్సేనా గండం గడిచింది
సాక్షి, విశాఖపట్నం: గత రెండు నెలలుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇన్‌చార్జి సీఎండీ ఎ.కె.సక్సేనా పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో సెయిల్ డైరెక్టర్‌ను నియమిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, సిబ్బంది తలపై పాలుపోసినంత పని చేసింది.
సక్సేనా పాలన.. ఆవేదన
గత ఏడాది సెప్టెంబర్‌లో స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సంక్షోభంలో ఉన్న సమయంలో.. అప్పటి సీఎండీ అతుల్ భట్‌ను సెలవుపై పంపి.. మోయిల్ ఎండీగా ఉన్న ఎ.కె.సక్సేనాకు స్టీల్‌ప్లాంట్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, సక్సేనా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పాలన ఉద్యోగులకు ఒక పీడకలలా మారిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగులను, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దేశంలో మరే పరిశ్రమలోనూ లేని విధంగా, కేవలం ఉత్పత్తి ఆధారంగానే జీతాలు చెల్లిస్తామంటూ సక్సేనా జారీ చేసిన చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘనత ఆయనకే దక్కుతుందని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు అందాల్సిన హెచ్‌ఆర్‌ఏను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.1.50 నుంచి ఏకంగా రూ. 8కి పెంచేసి, వేతన సవరణ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల నడ్డి విరిచారు. జీతాలను నెలలో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కల్పించారు. ఇచ్చే అరకొర జీతాన్ని కూడా 50శాతం, 60శాతం, 75శాతం అంటూ విడతల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మరోవైపు ప్రభుత్వ విధానామా? లేక నిర్దేశమా? ఏదైనా పొదుపు, సంస్కరణల సాకుతో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వీఆర్‌ఎస్ పేరుతో 1500 మందిని ఇంటికి పంపారు.
భయంగుప్పిట్లో అధికారులు
చిన్నపాటి మానవ, సాంకేతిక తప్పిదాలకు కూడా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం వంటి చర్యలతో ప్లాంట్‌లో భయానక వాతావరణం సృష్టించారు. ఇవన్నీ నిత్యకృత్యంగా మారడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు అధికారుల్లో నెలకొన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పలువురు ఉన్నతాధికారులు రాజీనామాలు చేశారు. మరోవైపు, కార్మిక సంఘాల హక్కులను హరిస్తూ, ఆందోళనలు, ధర్నాలపై ఆంక్షలు విధించి ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఆయన స్టీల్‌ప్లాంట్‌లో నియంతగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. స్టీల్‌ప్లాంట్‌లో సక్సేనా పాలనలో బాధపడని ఉద్యోగి లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు వెళ్లిపోతారా అని ఉద్యోగులు ఎదురుచూపులు చూడటం మొదలు పెట్టారు. సక్సేనాకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మద్దతు ఉందన్న ప్రచారంతో, ఆయనకే మళ్లీ ఎక్స్‌టెన్షన్ లభిస్తుందేమోనని రెండు నెలలుగా ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో సెయిల్ డైరెక్టర్‌ను కొత్త ఇన్‌చార్జి సీఎండీగా నియమించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాలన గాడిలో పడుతుందని, తమ కష్టాలు తీరుతాయని కార్మికులు ఆశిస్తున్నారు.


