స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌కు భూములివ్వం
నక్కపల్లి: మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలర్‌మిట్టల్ నిప్పల్ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ కోసం అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు స్పష్టం చేశారు. నెల్లిపూడి, వేంపాడు, డీఎల్ పురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ ఇప్పటికే మిట్టల్‌స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం 2020 ఎకరాలు భూములు కేటాయించిందన్నారు. వేంపాడు వద్ద టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకు 400 ఎకరాలు, స్టీల్‌ప్లాంట్ కోసం అదనంగా మరో 2800 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం జీవో నంబరు76 జారీ చేసిందన్నారు. నెల్లిపూడి, వేంపాడు, డీఎల్‌పురం తదితర గ్రామాల పరిధిలో భూములు సేకరించేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. పంటలు పండే వేలాది ఎకరాలను బలవంతంగా తీసుకుని కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయంజరగలేదన్నారు. నష్టపరిహారంతోపాటు, ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ చెల్లించేందుకు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా అదనంగా మరో 2,800 ఎకరాలు సేకరించడం అన్యాయమన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకుని, భూసేకరణ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం వారు తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు.ఈఆందోళనలో వైఎస్సార్‌సీపీ మండలశాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, రైతు నాయకులు అయినంపూడి మణిరాజు, లొడగల చంద్రరావు, మోహన్‌రావు, గింజాల వెంకటరమణ, సురేష్ రాజు, గొర్ల బాబూరావు, అవతారం రాజు తదితరులు పాల్గొన్నారు.


