జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 65 కేంద్రాలు
నాతవరం: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 65 కేంద్రాలు ఏర్పాటు చేశామని సివిల్ సప్లయి జిల్లా మేనేజరు జయంతి అన్నారు. ఆమె బుధవారం నాతవరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని, 5లక్షలు గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాలు వద్ద ధాన్యం తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 400 ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు 25 రైస్ మిల్లులకు అనుమతులు ఇచ్చామన్నారు. వాటిలో నాతవరం మండలంలోనే మూడు రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంతవరకు 4,500 టన్నులు కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా డబ్బులు రైతులు బ్యాంకు అకౌంట్లులో జమ చేస్తామన్నారు.


