మహిళా సంఘాలఅభివృద్ధిపై విజన్ ప్రణాళిక
సబ్బవరం: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదురవుతున్న అడ్డంకులను అధిరోహించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి తెలిపారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధికి ఐదేళ్ల విజన్ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో గ్రామ సంఘాలు మండల సమాఖ్యలలో చేపట్టబోయే జీవనోపాధి కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఉన్నత విద్యా శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సబ్బవరం మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులతో పాటు చోడవరం, అచ్యుతాపురం, పరవాడ, గొలుగొండ, యలమంచిలి, రాంబిల్లి మండలాల ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.


