టీడీపీ నాయకుల కుమ్ములాట
రావికమతం : మండలంలో తట్టబంద గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక పంచాయతీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభ రసాభాసగా మారింది. టీడీపీకి చెందిన ప్రస్తుత సర్పంచి గోకాడ రమణ విభజనకు అనుకూలంగా ఉండగా, అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శేఘబాబు,మాజీ ఉప సర్పంచ్ సింబోతు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పంచాయతీ విభజనపై అనుకూలం, వ్యతిరేకిస్తున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. పంచాయతీని విడదీయడానికి వీల్లేదని కొందరు, వీడదీయాల్సిందేనని మరికొందరు అధికారుల ముందే బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. అరుపులు కేకలతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీల విభజనపై వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తట్టబంద పంచాయతీలో ఎల్.ఎన్.పురం, బూరుగుపాలెం, కసిరెడ్డిపాలెం, సాయినగర్, పోర్లుపాలెం బలిజిపాలెం గ్రామాలు ఉన్నాయి. 3 వేల జనాభా, 2100 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్.ఎన్.పురం,బూరుగుపాలెం, కసిరెడ్డిపాలెం, పోర్లుపాలెం గ్రామాలను తట్టబంద పంచాయతీ నుంచి విడదీసి ఎల్.ఎన్.పురం కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని సర్పంచ్ గోకాడ రమణ అతడి వర్గీయులు మండల పరిషత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు పంచాయతీ కార్యదర్శి విజయ మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. పంచాయితీ విభజనను ఎంపీటీసీ సభ్యులు శేషుబాబు, మాజీ ఉప సర్పంచ్ సింబోతు నాయుడు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్పంచ్ రమణ ఎవరికీ చెప్పకుండా తీర్మాణం చేసి పంచాయతీని వీడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. తట్టబందను పంచాయతీగా అన్ని ఊర్లు కలిపి ఉండేలా 280 మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ఎల్.ఎన్.పురం కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలని పంచాయతీ తీర్మానం ఆమోదించాలని సర్పంచ్ వర్గీయులు పట్టుబట్టారు. దీంతో గొడవ ముదిరి ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామసభ రసాభాసగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామ సభను వాయిదా చేసినట్లు పంచాయితీ కార్యదర్శి విజయ విలేకరులకు తెలిపారు.
పంచాయతీ విభజనపై గ్రామసభ రసాభాస


