రెవెన్యూ డివిజన్‌పై డీఆర్‌సీలో తీర్మానం ప్రశంసనీయం
మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగేలా ప్రభుత్వ పెద్దలు తీర్మానం చేయడం సంతోషకరమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. అనకాపల్లిలో మంగళవారం జరిగిన డీఆర్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం త్వరితగతిన అమలు జరిగేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 27న కొత్తగా నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి వచ్చేలా జీవో విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే నక్కపల్లి డివిజన్‌లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలుపుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో పాటు నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా రైతులు, ప్రజల సహకారంతో పలు రూపాల్లో నిరసన తెలిపామన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్‌కు కూడా వినతిపత్రం అందజేసినా సానుకూల నిర్ణయం రాకపోవడంతో మునగపాకలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఈ నెల 15న అనకాపల్లిలో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా చూడాలని కోరుతూ ఇన్‌చార్జి మంత్రి రవీంద్ర దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. 1491 జీవోను సవరించి యథావిధిగా అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి ఉండేలా మరో జీవో వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జెడ్‌పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచ్‌లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, సుందరపు తాతాజీ, భీశెట్టి గంగప్పలనాయుడు, కర్రి పెదబ్బాయి, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, బొడ్డేడ బుజ్జి, మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు, పార్టీ నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, శీరా రమణమ్మ, కాండ్రేగుల జగన్, రామజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సభలో ప్రజల వాణి వినిపించిన
ఎమ్మెల్సీ కల్యాణికి కృతజ్ఞతలు
అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గాన్ని కొనసాగించాలి
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్


