కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహం
● దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా
ఐక్యంగా పోరాడాలి
● రైతు కూలీ సంఘం నిరసన ర్యాలీ
అనకాపల్లి : కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహమయ్యారని రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. స్థానిక విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి న్యూకాలనీ వరకూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూకాలనీ రోటరీ హాల్లో సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్‌రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులను, పీడిత ప్రజలను దోపిడీ చేసే విధానాలను వేగవంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే పచ్చని పంట పొలాలను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిల్లాలో దశాబ్దల కాలం పాటు రైతులకు, కార్మికులకు ఉపాధి ని చూపించిన వ్యవసాయాధారిత సుగర్ ఫ్యాక్టరీలను మూసేశారని, గూగుల్ డేటా సెంటర్, బల్క్ డ్రగ్ పార్కులు, ఫార్మా సిటీలు, హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడినప్పుడే పాలకుల దోపిడీ విధానాలను అరికట్టవచ్చని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో రైతులకు, కార్మికులకు సామాన్య ప్రజలకు వ్యతి రేకమైన చట్టాలకు మద్దతు తెలుపుతున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టానికి పని దినాలను తగ్గిస్తున్నారని, రైతు వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలను తీసుకొస్తున్నారని, కార్మిక హక్కులను దెబ్బతీసే నాలు గు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని, ఈ విధానాలపై సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్లా హర శ్రీనివాసరావు, కార్మిక నగారా పత్రిక ఎడిటర్ ఆడారి అప్పారావు, ఏఐఎఫ్ టీయూ(న్యూ) జిల్లా నాయకుడు అప్పలనాయుడు, నవ యువ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్. భాస్కరరావు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైలి రమేష్, రైతులు పాల్గొన్నారు.


