ప్రైవేటీకరణపై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
నర్సీపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు గౌతమ్ డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంచి ఆలోచనతో మెడికల్ కాలేజీలను నిర్మిస్తే, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూడడం దారుణమన్నారు. పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. రూ.6,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. స్కాలర్‌షిప్‌లు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేయాలన్నారు. మెస్‌ఛార్జీలు రూ.3 వేలుకు పెంచాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మూర్తి, శ్రీను, వరుణ్, అవినాష్, చరణ్, ఆకాష్, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.


