నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం అనంతరం ధనుర్లగ్న ప్రవేశాన్ని అనుసరించి మధ్యాహ్నం 12.57 గంటలకు విశేష ప్రసాద నివేదనలు అనంతరం ఘంటానాదం (నెలగంట) మోగిస్తారు. జనవరి 14వ తేదీ వరకు 30 రోజులపాటు శ్రీదేవీ, భూదేవీ సమేత కల్కి వేంకటేశ్వరస్వామివారికి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రతి రోజు రెండు వాహనాల్లో ఒకే సమయంలో గ్రామ తిరువీధి సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. స్వామివారి ఆలయంలో గోదాదేవి వ్రత దీక్షలో భాగంగా 30 రోజులపాటు తిరుప్పావై సేవాకాలం నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు.
30న ముక్కోటి ఏకాదశి
ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశిని (వైకుంఠ ఏకాదశి) పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు రంగనాథుని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భోగీ రోజున గోదారంగనాథుల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను రాజాధిరాజ వాహనంలో ఉంచి సాయంత్రం గరుడాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు.
నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు


