త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు
తుమ్మపాల: అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి, దేశ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
రేపు మెగా జాబ్ ఫెయిర్
నైపుణ్యాభివృద్ధి–శిక్షణ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశమని, 50కి పైగా ప్రముఖ కంపెనీలు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. గవరపాలెంలోని ఆదినారాయణ మహిళా కళాశాల (పార్క్ సెంటర్ వద్ద) ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు ఆమె సెల్‌ఫోన్‌లు పంపిణీ చేశారు. డిజిటల్ కార్యక్రమాల అమలులో భాగంగా సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అంగన్‌వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను అందిస్తున్నామన్నారు.


