నక్కపల్లి డివిజన్ నుంచి 3 మండలాల మినహాయింపునకు తీర్మాన
కొత్తగా ఏర్పాటు చేస్తున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలుపుతున్న కొన్ని మండలాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని, నక్కపల్లిలో కలపవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు తనకు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆమె ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు అందజేశారు. ఈ సమస్య గురించి మరికొందరు ప్రజా ప్రతినిధులు ప్రస్తావించడంతో నక్కపల్లి డివిజన్ నుంచి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను మినహాయించి.. అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని డీఆర్‌సీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకై క సహకార చక్కెర కర్మాగారమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేసి.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వసతి గృహలలో విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గొలుగొండ మండలంలో కేజీబీవీ స్కూల్లో గర్భం దాల్చిన మైనర్ బాలిక విషయంలో టీచర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పెద్దేరు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎన్టీఆర్ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోందని చెప్పారు. కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించి గొలుగొండ కేజీబీవీ పాఠశాలల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లను సస్పెండ్ చేశామని, ఎన్టీఆర్ ఆసుపత్రిలో మందుల కొరత లేదని.. ఆసుపత్రి కోసం ఇటీవల నిధులు కూడా కేటాయించామని చెప్పారు.


