తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
20 ఏళ్లుగా తిరుగుతున్నా..
ఎప్పటి నుంచో సాగులో ఉన్న భూమి మరొకరికి డీపట్టా ఇచ్చి సృష్టించిన భూ సమస్య పరిష్కరించకుండా కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయం వారు 20 ఏళ్లుగా తిప్పించుకుంటున్నారు. బోడపాలెం సర్వే నెం.439–2లో 70 సెంట్ల భూమిని నా భర్త గొర్లె అప్పన్న, వారి పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాము. నా భర్త మరణానంతరం సాగు భూమికి డీపట్టా ఉందంటూ పంచదార్ల చినరాజులమ్మ మనుషులు నా భూమిలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి 70 సెంట్ల బంజరు భూమి మా సాగులో ఉందని చెప్పిన అధికారులే ఇప్పుడు ఆ భూమి సబ్‌డివిజన్ మారిపోయిందని మాట మారుస్తున్నారు. 70 ఏళ్ల వయస్సులోనూ ముప్పుతిప్పలు పెడుతున్నారు.
–గొర్లె కాంతం, గొల్లల సన్యాసిరాజుపాలెం, కోటవురట్ల మండలం
ఆక్రమణదారులతో రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కు
నా అత్తమామల ద్వారా సంక్రమించిన భూమిని ఇతరులు ఆక్రమించి నాపై దాడి చేస్తున్నారు. ఆన్‌లైన్ చేయడానికి దరఖాస్తు చేస్తే తహసీల్దార్, సర్వేయర్, డీటీ, వీఆర్వో ఆక్రమణదారులతో కుమ్మకై ్క నాకు అన్యాయం చేస్తున్నారు. మూడేళ్లుగా కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గత వారం వస్తే అర్జీ పెండింగ్‌లో ఉందంటూ చాలాసేపు నమోదు కూడా చేయలేదు. మొత్తానికి నమోదు చేసుకున్నాక కలెక్టరమ్మ వద్ద మొర పెట్టుకుంటే కింది అధికారులకు అప్పగించారు. నా కొడుకు మరణించడంతో నేనే తిరగాల్సి వస్తోంది. నాకు దిక్కెవరు?
–బుదిరెడ్ల ముత్యాలమ్మ, వాకపల్లి, దేవరాపల్లి మండలం
తుమ్మపాల: వినతులు పేరుకు పోతున్నాయి.. సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.. పరిష్కారాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.. ఇదీ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) పరిస్థితి. ఈ వారం మొత్తం 325 అర్జీలు అందాయి. కలెక్టర్ విజయ కృష్ణన్‌తోపాటు డీఆర్వో సత్యనారాయణ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు క్షేత్రస్ధాయి పరిస్థితిని తెలుసుకొని తగిన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుల సంఖ్య పెరగకుండా త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలన్నారు.
దివ్యాంగ పింఛన్ నిలిపేశారు
దివ్యాంగురాలైన నాకు వికలాంగ పింఛన్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. నా సోదరుడికి ఉద్యోగం ఉందంటూ నా పింఛన్ నిలిపేశారు. నాకు వివాహమై నాలుగేళ్లంది. నా భర్తతో కలిసి వేరుగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ నా తల్లిదండ్రుల రేషన్ కార్డు ఆధారంగా పింఛన్ నిలిపివేయడంతో నాకు జీవనాధారం పోయింది.
–మర్లి రాజేశ్వరి, తీడ, కశింకోట మండలం
కలెక్టరమ్మ న్యాయం చేయాలి
జగనన్న హౌసింగ్ పథకంలో నాకు కోడూరులో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు కానీ కొత్త ప్రభుత్వం పట్టించుకోలేదు. పింఛన్ రూ.4 వేలు ఇంటి అద్దెకే ఖర్చయిపోతున్నాయి. ప్రభుత్వం ఇంటిని పూర్తి చేసి ఇస్తేనే నా కష్టాలు తీరుతాయి. ఒంటరిగా జీవిస్తున్న నన్ను అధికారులు రకరకాల పత్రాలు కావాలంటూ తిప్పిస్తున్నారు. కలెక్టరమ్మ నాకు న్యాయం చేయాలి.
– షాకే బేగం, గవరపాలెం, అనకాపల్లి మండలం
సీఆర్‌ఎంటీల మొర ఆలకించండి
స్కూల్ కాంప్లెక్స్‌లను ఏ, బీ క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవడంతోపాటు సీఆర్‌ఎంటీల అర్హతల ఆధారంగా వేతనాలు పెంచాలని, ఎంటీఎస్ అమలు, డీఎస్సీలో వెయిటేజీ వంటి సమస్యల పరిష్కరించాలని ఏపీ సీఆర్‌ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. సమగ్ర శిక్షలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలంటూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు


