ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం | - | Sakshi
Sakshi News home page

ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం

Dec 15 2025 8:50 AM | Updated on Dec 15 2025 8:50 AM

ప్రజా

ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం

చంద్రబాబు సర్కార్‌ తీరుపై ప్రజాగ్రహం ప్రస్ఫుటమైంది.. నిరంకుశపాలనపై నిరసన కలం ఝుళిపించింది.. ప్రైవేటీ కరణ వద్దని రణం సాగించింది.. వీధి, వాడా, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా.. పండితులు,పామరులు, విద్యార్థులు, మహిళలు, పురుషులు, మేధావులు అన్న బేధం లేకుండా కలాన్ని కరవాలంగా చేసి ఆగ్రహాన్ని చేవ్రాలుతో వ్యక్తం చేశారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ ప్రజాఉద్యమంలో భాగస్వాములై తమ నిరస స్పష్టంగా తెలియజేశారు.

సాక్షి, అనకాపల్లి: పేదలకు ఉచితంగా వైద్య విద్య, ఉన్నత వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్‌ ప్రైవేటుపరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్యసేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం..విలువైన సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెడుతుండటంపై అన్నివర్గాల ప్రజలు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం సూపర్‌ సక్సెస్‌ అయింది. సామాన్య ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లాలో సంతకాల సేకరణ కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయానికి చెంపపెట్టు లా సంతకాల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. జిల్లాలో సుమారు 3.86 లక్షల మంది చంద్రబాబు సర్కార్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాల ఉద్యమానికి మద్దతు పలికారు.

టీడీపీ నేతలకు చెంపపెట్టు..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో గత ప్రభుత్వ హయాంలోనే ఏడు మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యాయి. వీటిలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్‌ కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన పదింటిలో పార్వతీపురం జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులూ తుదిదశకు చేరుకున్నాయి. అనకాపల్లి జిల్లా భీమబోయిన పాలెంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు 60 శాతంకు పైగా పూర్తయ్యాయి. మిగిలినవి కూడా సగానికి పైగా పూర్తయ్యాయి. అయితే మెడికల్‌ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటకు అప్పగించాలని నిర్ణయించిన తర్వాత... అసలు మెడికల్‌ కాలేజీల నిర్మాణమే జరగలేదంటూ టీడీపీ నేతలు అవాస్తవాలతో ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి... అసలు మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి జీవో ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. జీవో ఉంటే తనకు చూపించాలంటూ సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 10వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీల భవనాల వద్ద జీవో కాపీని చూపించారు. దీంతో అటువైపు నుంచి అయ్యన్నపాత్రుడు చప్పుడు చేయకుండా మిన్నకుండిపోయారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమంతో టీడీపీ నేతలకు చెంపపెట్టులాంటిది.

జిల్లాలో సంతకాలు ఇలా..

జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సంతకాలను సేకరించారు. వీటిలో నర్సీపట్నం నియోజకవర్గంలో 61 వేలు, అనకాపల్లి నియోజకవర్గంలో 60 వేలు, చోడవరంలో 50వేలు, మాడుగులలో 50 వేలు, పాయకరావుపేటలో 52 వేలు, యలమంచిలిలో 50 వేలు, పెందుర్తిలో 55 వేల మంది సంతకాలు చేశారు.

ఎ.కొత్తపల్లి గ్రామంలో సంతకాల సేకరణ చేయిస్తున్న

మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు (ఫైల్‌)

సంతకాల సేకరణ పత్రాలను స్వీకరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ పాయకరావుపేట, యలమంచిలి సమన్వయకర్తలు జోగులు, ధర్మశ్రీ (ఫైల్‌)

కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలో పాల్గొనాలి

దాదాపుగా రెండు నెలల పాటు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ సంతకాల ద్వారా ఉద్యమానికి మద్దతు పలికిన సామాన్యప్రజలకు, మేధావులకు, యువత, విద్యార్థులకు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 15వ తేదీన ఈ ఉద్యమంలో సేకరించిన సంతకాలను అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిలో గల కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలించనున్నాం. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు , వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి.

– గుడివాడ అమర్‌నాథ్‌, వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు

ఉద్యమం సాగిందిలా...

వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై నిరసిస్తూ... వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమంలో ప్రజలు ఎక్కడికక్కడ తమ సంతకాలతో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం చూపించారు. అక్టోబరు 10వ తేదీన ఈ ఉద్యమం ప్రారంభమైంది. రెండు నెలలపాటు ‘రచ్చబండ కార్యక్రమం’ ద్వారా సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అదేవిధంగా నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు భాగస్వామ్యమై మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని నిరసించారు. నియోజకవర్గాల పార్టీ కార్యాలయాల నుంచి సేకరించిన సంతకాలను ర్యాలీగా డిసెంబర్‌ 10న జిల్లా కేంద్రాలకు తరలించారు.

భారీ ర్యాలీ

సంతకాల పత్రాలతో ఈ నెల 15న అనకాపల్లి టౌన్‌ రింగ్‌ రోడ్డులో ఉన్న వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి బెల్లంమార్కెట్‌, పెరుగుబజార్‌ మీదుగా ఎన్‌టీఆర్‌ క్రీడా మైదానం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ జెండా ఊపి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి ఈ సంతకాల పత్రాలను తరలిస్తారు. అనంతరం 17వ తేదీన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు గవర్నర్‌కు అందజేయనున్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై

పెల్లుబికిన నిరసన

చంద్రబాబు సర్కారు తీరుపై

కోట్లామంది కన్నెర్ర

కోటి సంతకాల ప్రజా ఉద్యమం..

సూపర్‌ సక్సెస్‌

చేవ్రాలుకు వెల్లువలా తరలివచ్చిన సామాన్య ప్రజానీకం

జిల్లాలో 3.86 లక్షల మంది నుంచి

సంతకాలు సేకరణ

నేడు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి

తరలింపు

ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం1
1/2

ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం

ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం2
2/2

ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement