‘దయ’ ఉంటేనే నష్టపరిహారం
● నిర్వాసితుల గుర్తింపులో ఏపీఐఐసీ అధికారి అక్రమాలు
● లంచాలు ఇస్తేనే అంచనాల తయారీ
● నిర్వాసితుల జాబితాలో స్థానికేతరులు
నక్కపల్లి: అతని దయ ఉంటేనే నిర్వాసితులు నష్టపరిహారానికి నోచుకుంటారు. లేకపోతే జాబితాలో చోటు దక్కదు. లంచాలు ఆశ చూపిస్తేనే అంచనాలు తయారు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్క్ డ్రగ్‌పార్క్, ఆర్సిలర్‌మిట్టల్‌స్టీల్‌ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితుల ఇళ్లకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఏపీఐఐసీ అఽధికారి దయ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులు సిఫారసు చేసినవారికి, లంచాలు ఆశచూపిన వారికి అధికంగాను మిగిలిన వారికి తక్కువగా నష్టాన్ని అంచనా వేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో తొలగించేందుకు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం అంచనావేయడంతో ఏపీఐఐసీలో పనిచేస్తున్న దయ అనే ఉద్యోగి లంచాల ఆశ కారణంగా బాధితులకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులైన వారు, స్థానికేతరులు నిర్వాసితుల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకివెళ్తే చందనాడ పంచాయతీ తమ్మయ్యపేటలో సర్వేనంబరు 90 /9,90/10లలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో 70 ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఈ 12 ఎకరాలను ప్రభుత్వం స్టీల్‌ప్టాంట్‌కోసం సేకరిస్తోంది. ఈ నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇళ్లతోపాటు, రైతులకు చెందిన పశువుల షెడ్లు కూడా ఉన్నాయి. ఇళ్లకు చదరపు అడుగుకు రూ.750 చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి నిర్ణయించారు.ఈ మేరకు నిర్మాణాలకు సంబంధించిన ఎన్యూమరేషన్, ఎస్టిమేషన్లు తయారు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఏసీఐఐసీ, ఆర్‌అండ్‌బీఅధికారులు నిర్మాణాలకు విస్తీర్ణాన్ని బట్టి నష్టపరిహారం అంచనాలు తయారు చేస్తున్నారు. ఇక్కడే అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్‌సీసీ శ్లాబ్ ఇళ్లకు తక్కువగా, షెడ్లు, పెంకుటిళ్లకు అధికంగాను అంచనాలు తయారు చేసి నష్టపరిహారం కోసం సిఫారసు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్యూమరేషన్ చేస్తున్న అధికారుల్లో దయ అనే ఏపీఐఐసీ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నారని, సదరు అధికారి కూటమినాయకులు సూచించిన వారికి, కమీషన్లు ఆశచూపించిన వారికి అధికంగా నష్టపరిహారం సిఫారసు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ సర్వే నంబర్లలో సుమారు 70 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకుని ఎప్పటినుంచో కాపురాలు చేస్తుంటే కొంతమంది టీడీపీ నాయకులు ఏపీఐఐసీ అధికారులతో కుమ్మకై ్క స్థానికేతరులు సుమారు 50 మందిని అదనంగా నిర్వాసితుల జాబితాల్లో చేర్చి వారికి కూడ ఇక్కడ ఇళ్లు ఉన్నట్లు నష్టపరిహారం కోసం ఎన్యూమరేషన్ చేయించి జాబితాలు సిద్ధం చేశారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఈ జాబితాలో ఉన్నవారెవరూ తమ గ్రామాలకు చెందిన వారు కాదనివారు చెబుతున్నారు. ఆరు సెంట్ల విస్తీర్ణంలో రెండు ఆర్‌సీసీ శ్లాబ్ ఇళ్లుకలిగిన దారబాబు అనే నిర్వాసితుడికి కేవలం రూ.6లక్షల నష్టపరిహారం సిఫారసు చేశారని, కేవలం రెండు సెంట్ల స్థలంలో కనకమ్మకు చెందిన రేకుల షెడ్డుకు రూ.5లక్షల నష్టపరిహారానికి సిఫారసు చేశారని బాదితులు చెబుతున్నారు..అలాగే నాగ చిన అమ్మాయి, గోవిందమ్మలకు చెందిన ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు నివసిస్తుంటే ఒకరికి అదనంగాను మరొకరికి తక్కువగా నష్టపరిహారం చెల్లించేందుకు సిఫారసు చేశారన్నారు. కె. వీరబాబు అనే వ్యక్తి ఇంటికి గతంలో రూ.2లక్షలకు అంచనాలు వేసి సిఫారసు చేయగా, తాజాగా నిర్వహించిన ఎన్యూమరేషన్‌లో రూ.5.30లక్షలకు సిఫార్సులు చేశారన్నారు. టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మకై ్క కమీషన్లకు మాట్లాడుకుని తుని, యలమంచిలి, వెదుళ్లపాలెం, నక్కపల్లి, అడ్డురోడ్డు తదితర ప్రాంతాలకు చెందిన బినామీలను నిర్వాసితుల జాబితాల్లో చేర్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా అధికారులు చేర్చిన 50 మందికి చందనాడ, తమ్మయ్యపేట, తుమ్మలపేట గ్రామాల్లో ఎక్కడా ఇళ్లు గాని, ఇంటిపన్ను రశీదులు గాని, కరెంటు బిల్లులు కాని లేవు. కేవలం నష్టపరిహారాన్ని కూటమినాయకులు, ఏపీఐఐసీ అధికారులు ఫిఫ్టీఫిఫ్టీ పంచుకోవడం కోసమే బినామీ పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. నక్కపల్లి తహసీల్దార్ ఆర్.నరసింహమూర్తి వివరణ కోరగా అంచనాల తయారీలో అవకతవకలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిపై డివిజనల్ ఇంజినీర్ స్థాయి అధికారితో రీ సర్వే జరిపిస్తామని తెలిపారు.
కేవలం ఐదు లక్షలకు సిఫారసు చేసిన ఆర్‌సీసీ శ్లాబ్ ఇల్లు ఐదులక్షల నష్టపరిహారానికి సిఫారసు చేసిన రేకుల షెడ్లు
అంచనాలో వివక్ష
నా కుమార్తె, మరో కుటుంబం కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. రెండు పోర్షన్ల ఈ ఇంటికి నష్టపరిహారం అంచనాలో వివక్ష చూపించారు. నా కుమార్తెకు రూ.1.30లక్షలు మరో ఆసామీకి రూ.2.14లక్షలకు సిఫారసు చేశారు. ఇదెక్కడి అన్యాయం. ఒకే విస్తీర్ణంలో ఉన్న రెండు పోర్షన్లకు వేర్వేరుగా నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు.
– చిన అబ్బాయి, తమ్మయ్యపేట
పరిహారంలో పక్షపాతం
ఇళ్లకు నష్టపరిహారం చెల్లించడంలో ఏపీఐఐసీ అధికారులు పక్షపాతం చూపిస్తున్నారు. కూటమినాయకులు సిఫారసుల ప్రకారమే నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గ్రామంలో లేని వారిపేరున ఇక్కడ ఇళ్లు ఉన్నట్లు నమోదు చేసి జాబితాలు సిద్ధం చేస్తున్నారు. నష్టపరిహారం, ఆర్‌అండ్ ఆర్‌ప్యాకేజీ చెల్లించకుండా ఇళ్లు ఖాళీ చేయాలంటున్నారు. ఇది జరగని పని, నిర్వాసితుల జాబితాలపైపూర్తిగా విచారణ జరపాలి.
– కొప్పిరెడ్డి రోహిణి రాణి, చందనాడ
జాబితాలపై విచారణ చేయాలి
స్థానికేతరులైన 50 మంది పేర్లు చందనాడలో నివాసం ఉంటున్నట్లు జాబితాల్లో చేర్చారు. వారికి కూడా నష్టపరిహారం చెల్లించేందుకు సిఫారసు చేస్తున్నారు. వీరెవరికి మా గ్రామపరిధిలో ఇళ్లు లేవు. వీరంతా ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఈజాబితాలపై సమగ్రంగా విచారణ జరపాలి. దయ అనే అధికారి ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడు. చాలా సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
– తళ్ల భార్గవ్, వైఎస్సార్‌సీపీనేత, చందనాడ
‘దయ’ ఉంటేనే నష్టపరిహారం
‘దయ’ ఉంటేనే నష్టపరిహారం
‘దయ’ ఉంటేనే నష్టపరిహారం
‘దయ’ ఉంటేనే నష్టపరిహారం


