యువకుల మృతితో విషాద ఛాయలు
మునగపాక: అచ్యుతాపురంలో మండలంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందడంతో మునగపాక మండలంలోని గణపర్తి, చెర్లోపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తరుణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడాన్ని ఆయా కుటుంబాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. తమకు దిక్కెవరంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఆపడం ఎవరి తరం కాలేదు. గణపర్తి గ్రామానికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతులకు ఒక్కగా నొక్క కుమారుడు ధనువిజయ్(19). మహేష్ స్థానికంగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు ధను విజయ్ లైటింగ్ పనులకు సహాయకునిగా వెళ్తుంటాడు. ఎప్పటిలాగానే శనివారం రాత్రి ఇంటికి వస్తుండగా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు అర్ధంతరంగా చనిపోవడాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు. అలాగే చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూళి దుర్గ(20) విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. తండ్రి గతంలో మృతి చెందడంతో కుటుంబానికి అండగా ఉంటూ జీవనం సాగిస్తున్న దుర్గ కూడా శనివారం రాత్రి తన స్నేహితుడు ధను విజయ్‌తో కలిసి బైక్‌పై వస్తుండగా జగన్నాథపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో చెర్లోపాలెంలో విషాదం నెలకొంది. దుర్గ తల్లి నాగమణి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడు తనకు దిక్కెవరంటూ ఆమె కన్నీటి పర్వం చెందుతున్నారు.
యువకుల మృతితో విషాద ఛాయలు
యువకుల మృతితో విషాద ఛాయలు
యువకుల మృతితో విషాద ఛాయలు


