కాపులంతా ఐక్యంగా ఉండాలి
తూర్పుకాపుల వన సమారాధనలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, తూర్పుకాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని
చోడవరం: కాపులంతా ఐక్యంగా ఉండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. తూర్పుకాపు సంఘం, కె.ఆర్. గ్రూపు, కాపు సంక్షేమ సంఘం సంయుక్తంగా మండలంలోని గౌరీపట్నం సూర్యచంద్ర దేవాలయం సమీపంలో ఆదివారం వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాలకు చెందిన నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ కాపు కులస్తులు సమష్టిగా ఉండి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి సాధించాలన్నారు. వెనుకబడి ఉన్నవారికి సహాయ సహకారాలు అందించాలని, వైఎస్సార్‌సీపీ హయాంలో ఉత్తరాంధ్ర తూర్పుకాపులకు సముచిత స్థానం దక్కిందని తెలిపారు. రాష్ట్ర తూర్పు కాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని మాట్లాడుతూ తూర్పు కాపు సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు కొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కాపు సంఘాలు ప్రతినిధులు, సమారాధన నిర్వహణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్


