సందడిగా పీఆర్టీయూ వన సమారాధన
మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు
కశింకోట: ఉపాధ్యాయినులకు చైల్డ్ కేర్ లీవ్ లీవ్ ఉపయోగించుకునే ఉత్తర్వులు త్వరలో రానున్నట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. మండలంలోని బయ్యవరం శారదా వనంలో పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వన సమారాధన ఆదివారం సందడిగా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా యూనియన్ కన్వీనర్ డి. గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాదె మాట్లాడుతూ టెట్ విషయంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. 2004కు ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఓపీఎస్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నాయన్నారు.విశాఖ జిల్లా అధ్యక్షుడు మడ్డు శ్రీను, కార్యదర్శి నాగేశ్వరరావు, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.పెద్ది నాయుడు, అల్లూరి జిల్లా అధ్యక్షుడు యు.వి.గిరి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


