బైక్‌ను ఢీకొన్న లారీ: వ్యక్తి దుర్మరణం
యలమంచిలి రూరల్: మండలంలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రేగుపాలెం హైవే కూడలి వద్ద శుక్రవారం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పొందాడు. నక్కపల్లి మండలం నెల్లిపూడికి చెందిన మడుగుల నాగు (36) యలమంచిలి నుంచి నెల్లిపూడికి పల్సర్ బైక్‌పై వెళ్తుండగా రేగుపాలెం హైవే కూడలి వద్ద యలమంచిలి నుంచి తుని వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న నాగు లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో తల, పొట్ట, శరీర భాగాలు నుజ్జయ్యాయి. మృతుడి అత్తవారు యలమంచిలి పట్టణం ధర్మవరంలో ఉండడంతో తరచుగా అక్కడికి వచ్చిపోతుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం అత్తవారింటికి వచ్చి తిరిగి నెల్లిపూడి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్సై ఎం.ఉపేంద్ర తెలిపారు.


