పశు దాణాలో రాజకీయం
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం..
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం.. శ్రీరంగ ధామేశ్వరీం.. అంటూ ఎవరైతే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా పూజిస్తారో వారింట ఆ తల్లి సిరుల పంట కురిపిస్తుందని భక్తుల నమ్మకం. అందుచేతనే పట్టణంలోని ధర్మవరంలో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. యలమంచిలి, ధర్మవరం పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 2000 మంది మహిళా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. వారంతా కలిసి సామూహికంగా లక్ష పుష్పార్చన, కుంకుమ పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు వెలవెలపల్లి కోటేశ్వరశర్మ (కోటి పంతులు) భక్తులతో శాస్త్రోక్తంగా పూజా క్రతువు చేయించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. – యలమంచిలి రూరల్
నర్సీపట్నం: పాడి పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న సమీకృత దాణా కూటమి నాయకుల రాజకీయ ఒత్తిడితో పక్కదారి పడుతోంది. వారి ఆశీస్సులు ఉన్న రైతులకు మాత్రమే పశు దాణా అందుతోంది. వారు తీసుకోగా ఏమైనా ఉంటే మిగతా వారికి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. పశుసంవర్ధక సిబ్బంది సైతం కూటమి నాయకులు సూచించిన రైతులకే పశు దాణా ఇస్తున్నారు. రాజకీయ ప్రమేయంతో దాణా పంపిణీ చేయడంతో నర్సీపట్నం మండలం అమలాపురంలో రైతులు వెటర్నరీ అసిస్టెంట్‌ను నిలదీశారు. ఇదే విధంగా మిగిలిన పంచాయతీల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే దాణా సరఫరా జరుగుతోంది. సమీకృత దాణాతో పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ దాణా పెట్టడం వల్ల పాడి పశువుల పెంపకం లాభదాయకంగా ఉంది. సబ్సిడీపై సరఫరా చేస్తున్న సమీకృత దాణాపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రైతుల డిమాండ్‌కు తగ్గట్టుగా పశు దాణా సరఫరా కావటం లేదు. దీంతో సమీకృత దాణాకు డిమాండ్ పెరిగింది.
8 నెలల్లో నాలుగోసారి..
పశు దాణా ప్రతి నెల సరఫరా చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 8 నెలల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే అరకొరగా సరఫరా చేశారు. ఇటీవల విడుదల చేసిన నాలుగో విడతలో జిల్లాలో 5550 బస్తాలు పంపిణీ చేశారు. ఎస్సీలకు 994 బస్తాలు, ఎస్టీలు 320 బస్తాలు, ఇతరులకు 4236 బస్తాలను సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగో విడతలో నర్సీపట్నం వ్యవసాయ డివిజన్‌లోని నర్సీపట్నం, గొలుగొండ మండలాలకు 25 మెట్రిక్ టన్నుల దాణా సరఫరా చేశారు. ప్రతి పంచాయతీకి 25 బస్తాల నుంచి 30 బస్తాల దాణా వస్తోంది. 50 కిలోల సమీకృత దాణాను ప్రభుత్వం 50 శాతం రాయితీపై సరఫరా చేస్తోంది. రూ.1,110 ధర బస్తాను సబ్సిడీపై రూ.555లకు రైతులకు అందిస్తున్నారు. దాణాతో పశుపోషణ బాగుండడంతో రైతులంతా దాణాపై ఆసక్తి చూపుతున్నారు. గ్రామస్థాయి కూటమి నాయకులు దాణా పంపిణీలో చక్రం తిప్పుతున్నారు. వారి అనుకూలంగా ఉండే రైతులకు దాణా ఇప్పించుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి లేని రైతులకు మొండిచేయి చూపిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా దాణా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
రాజకీయ జోక్యం ఉండదు
దాణా పంపిణీలో రాజకీయ జోక్యం ఉండదు. మూడు పశువులు కలిగిన రైతులకు మాత్రమే దాణా ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో దాణా సరఫరా కాలేదు. దాణా పంపిణీలో రాజకీయ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటాం.
–డబ్ల్యు.రాంబాబు, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, నర్సీపట్నం
పశు దాణాలో రాజకీయం


