యలమంచిలిని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలి
మునగపాక : ప్రజలకు స్థానికంగా పాలన అందించాల్సిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం సరికాదని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ హితవు పలికారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి డివిజన్‌లో కాకుండా నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు కానున్న డివిజన్‌లో కలపడాన్ని నిరసిస్తూ మునగపాకలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. మునగపాక, చూచుకొండ, మెలిపాక గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు దీక్షలో కూర్చొన్నారు. వారికి సంఘీభావంగా సమన్వయ కర్తలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ మద్దతు పలికారు. ముందుగా మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఎప్పటి నుంచో అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో యలమంచిలి నియోజకవర్గం కొనసాగేదని అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 1491 ద్వారా నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు కానున్న డివిజన్‌లో కలపడం సరికాదన్నారు.
ఈ ప్రాంత రైతులు, ప్రజలు తమ పనుల కోసం నక్కపల్లి వెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పునరాలోచించి అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగేలా చూడాలన్నారు. దీనికోసం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు, రైతులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు పాల్గొన్నారు.


