కనులపండువగా..కనకమహాలక్ష్మి రథయాత్ర
డాబాగార్డెన్స్ (విశాఖ): కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర శనివారం వైభవంగా సాగింది. అమ్మవారి మాలధారణ చేసిన భక్తులు పూర్ణ కలశాలతో యాత్రలో పాల్గొన్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యాత్రను సాయంత్రం 4 గంటలకు జగదాంబ జంక్షన్ మహారాణిపేటలో ఉన్న అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ ఈవో కె. శోభారాణి, పలువురు ప్రముఖులు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. జగదాంబ జంక్షన్, టర్నర్‌చౌల్ట్రీ, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజీ డౌన్, టౌన్ కొత్తరోడ్డు, రీడింగ్‌రూమ్ మీదుగా అమ్మవారి దేవస్థానం వరకు యాత్ర సాగింది. రథయాత్రలో విజయనగరం మహారాజ కళాశాల కళాకారుల పులివేషాలు, చెక్కభజన, కోలాటం, తప్పిటగుళ్లు, నవదుర్గలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు, మాలధారణ చేసిన మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కనకమహాలక్ష్మికి విశేష పూజలు..
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారికి విశేషంగా పూజలు చేశారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారికి క్షీరాభిషేకం, పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం జరిపారు. పలువురు ఉభయదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహస్ర తులసీదళార్చన పూజలో పలువురు ఉభయ దాతలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కనులపండువగా..కనకమహాలక్ష్మి రథయాత్ర
కనులపండువగా..కనకమహాలక్ష్మి రథయాత్ర
కనులపండువగా..కనకమహాలక్ష్మి రథయాత్ర


