ఖైదీలు డబుల్.. సిబ్బందికి ట్రబుల్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. జైలు సామర్థ్యానికి దాదాపు రెట్టింపు ఖైదీలు ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత కారణంగా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న అరకొర సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా భర్తీ జరగకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ 27 మంది వార్డర్లు, హెడ్ వార్డర్ల కొరత ఉంది. 2000లో కొత్త జైలు ప్రారంభించినప్పుడు 162 మందిని(వార్డర్ల నుంచి సూపరింటెండెంట్ వరకు) నియమించారు. బదిలీలు, ఉద్యోగ విరమణల కారణంగా ప్రస్తుతం 135 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. నిజానికి ఇక్కడ జైలు సామర్థ్యం 914 మంది కాగా.. శుక్రవారం నాటికి 1,704 మంది ఖైదీలు ఉన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన ముద్దాయిలతో ఎనిమిదేళ్లుగా జైలు కిక్కిరిసిపోతోంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఈ జైలుపై దృష్టి పెట్టడం లేదు. ఖైదీల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించడం లేదు. పెరుగుతున్న ఖైదీల సంఖ్యను బట్టి, ఇక్కడ కనీసం 200 మందికి పైగా సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంంది. దీనిపై జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం 27 మంది వార్డర్లు, హెడ్ వార్డర్ల కొరత ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రత్యేకంగా జైలు రిక్రూట్‌మెంట్‌లో సిబ్బందిని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సూపరింటెండెంట్ వివరించారు.


